జనసేన ‘గాజు’ తోనే బరిలోకి..

జనసేన శ్రేణుల్లో సంతోషం నింపింది ఈసీ. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ సందర్బంగా ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. గాజు గ్లాసుకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గాజు గ్లాసు చూస్తే.. జనసేన పార్టీ గుర్తుకు వచ్చేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అయితే ఎన్నికల సంఘం తొలగించిన తరువాత జనసైనికులు నిరాశ చెందారు. జనసేన పార్టీకి
గాజు గ్లాస్ గుర్తు ఉండబోదంటూ ప్రచారం మొదలైంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ కి గాజు గ్లాస్ గుర్తు వస్తుందో రాదో అనే ఆందోళనలో శ్రేణులు ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయించి వారిలో సంతోషాన్ని నింపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి జనసేన బరిలోకి దిగబోతుంది. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది పార్టీ. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.