అందుకే సోనియా గాంధీపై ఈడీ కేసులు పెట్టారుః జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయడమే బీజేపీ లక్ష్యం.. జగ్గారెడ్డి

jagga reddy

హైదరాబాద్ః ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిజెపిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయడమే బీజేపీ లక్ష్యమని… అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఈడీ కేసులు పెట్టారని అన్నారు. గుజరాత్ లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై క్రిమినల్ కేసులున్నాయని… వారు రాజకీయ, మతపరమైన హత్యలు చేయించారని చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్నవారు క్రిమినల్స్ కాదని చెప్పారు.

సీబీఐ, ఈడీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా ఈడీ కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక… చిన్నచిన్న కారణాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

శాంతియుతంగా ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్ర్యం కోసం పని చేసిందని… అప్పట్లో బ్రిటీష్ వాళ్ల రహస్యాలను, విషయాలను ప్రజలకు తెలియజేసిందని… అలాంటి పత్రికతో బీజేపీకి ఏం సంబంధమని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గంటల తరబడి ప్రశ్నించడం దారుణమని చెప్పారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/