ఈడీకి అరెస్ట్, స‌మ‌న్లు జారీ చేసే అధికారం ఉందిః సుప్రీంకోర్టు

Supreme-Court
Supreme-Court

న్యూఢిల్లీః మ‌నీల్యాండరింగ్ చ‌ట్టం కింద అరెస్టు చేసే, స‌మ‌న్లు జారీ చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌కు ఉన్న‌ట్లు నేడు సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. పీఎంఎల్ఏ చ‌ట్టం కింద విచార‌ణ చేప‌ట్టేందుకు, అరెస్టు చేసేందుకు, ప్రాప‌ర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్న‌ట్లు సుప్రీం త‌న తీర్పులో తెలిపింది. పీఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారాల‌ను సుప్రీం స‌మ‌ర్థించింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ లాంటి ద‌ర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదు అని, అందుకే విచార‌ణ స‌మ‌యంలో వాళ్లు సేక‌రించిన ఆధారాలు వాస్త‌వ‌మైన‌వే అని బెంచ్‌ పేర్కొన్న‌ది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేస్తున్న వ్య‌క్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కోర్టు పేర్కొన్న‌ది.

కాగా, విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక- ఈసీఐఆర్​ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న కోర్టు.. అది ఎఫ్​ఐఆర్​తో సమానమని స్పష్టం చేసింది. ఆరోపణలపై ఆధారాల కోసం నిందితుడిపై ఒత్తిడి చేయడం అంటే అతడి ప్రాథమిక హక్కు, జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్లు వాదించగా దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి సవాళ్లుగా మారిన ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవని కేంద్రం పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈడీ అధికారాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/