ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు..షాక్ తో హాస్పటల్ లో చేరిన ఇంటి యజమాని

మాములుగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు వస్తే వందల్లో , వేలల్లో వస్తుంది..కానీ ఇక్కడ ఏకంగా కోట్లలో రావడంతో ఆ బిల్లు చూసి ఇంటి యజమాని షాక్ తో హాస్పటల్ పాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగర శివ్‌విహార్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా కుటుంబం ఐదు రోజుల కిందట వారు ఉండే ఇంటికి ఏకంగా రూ.3,419 కోట్ల విద్యుత్తు బిల్లు వచ్చిందంట. ఆ బిల్లు చూసి ఆ ఇంటిపెద్ద (ప్రియాంక మామ) తీవ్ర అస్వస్థతకు గురై..హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రియాంక గుప్తా భర్త సంజీవ్‌ కంకణె మాట్లాడుతూ.. జులై 20న వచ్చిన ఈ బిల్లును విద్యుత్తుశాఖ పోర్టల్‌ ద్వారా పరిశీలించినా అంతే మొత్తం ఉన్నట్లు వచ్చిందన్నారు. విషయాన్ని స్టేట్‌ పవర్‌ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..భారీ విద్యుత్ బిల్లుకు మానవ తప్పిదమే కారణమని, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ తెలిపారు.సాఫ్ట్‌వేర్‌లో వినియోగించిన యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు నంబర్‌ను నమోదు చేయడంతో ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని నితిన్ చెప్పారు. విద్యుత్ వినియోగదారునికి రూ.1,300 సరిచేసిన బిల్లును జారీ చేసినట్లు నితిన్ వివరించారు.