నాలుగేళ్ల పాలనలో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం: సిఎం జగన్

క్యాంపు ఆఫీసు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించిన జగన్

cm-jagan

అమరావతిః సిఎం జగన్‌ ఈరోజుతాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపిలో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని వారు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిపోయిన లబ్దిదారులకు మంచి చేయడం కోసమే ఈ జగనన్నసురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సేవలు రాష్ట్రంలోని అర్హులు అందరికీ అందించాలన్నదే తమ సర్కారు లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం పింఛన్ల కోసం ఉద్యమాలు జరిగేవని జగన్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేశామని వివరించారు. నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చినట్లు జగన్ పేర్కొన్నారు.

వచ్చే నెల 23 వరకు జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా శనివారం నుంచి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి, వేగంగా పరిష్కరిస్తారని సీఎం జగన్ వివరించారు. ఇందుకోసం రాష్ట్రంలో 15,004 సురక్ష క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 1902 నెంబర్ తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంపుల్లో మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను అర్హులకు ఉచితంగా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తుందని తెలిపారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేయడంతో పాటు దగ్గరుండి ఆ రోజు క్యాంపు వద్దకు తీసుకెళ్తారని సీఎం జగన్ పేర్కొన్నారు.