రేపు నడ్డా, అమిత్ షాతో భేటీ కానున్న ఈటల, రాజగోపాల్

కొంతకాలంగా బిజెపిలో అసంతృప్తితో ఉన్న ఇరువురు నేతలు

etela-and-rajagopal-may-meet-nadda-and-amit-shah-tomorrow

హైదరాబాద్‌ః బిజెపిలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌, సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పెద్దలు ఈ ఇద్దరినీ ఈ రోజు ఢిల్లీ పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. రేపు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఈటల, రాజగోపాల్ రెడ్డి సమావేశం అవుతారని సమాచారం అందుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోగా.. బిజెపి అనూహ్యంగా బలహీనం అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు కోరుకుంటున్న ఈటల, రాజగోపాల్ అది జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో వీరిద్దరూ తమ పార్టీలోకి వస్తారంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ఇరువురు నేతలు ఖండించకపోవడంతో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇద్దరికి బిజెపి పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత ఈటల, రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.