మరోసారి మియామిలోని ఫెడరల్‌ కోర్టుకు హాజరైన డొనాల్డ్‌ ట్రంప్‌

donald-trump-pleaded-not-guilty-to-all-charges-in-case-related-to-classified-documents

ఫ్లోరిడాః అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం మరోసారి మియామిలోని ఫెడరల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొన్నారు. తన ఇంట్లో ఆ పత్రాలను దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ట్రంప్ పై కేసు నమోదైంది. లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు. ఈ ఏడాది ట్రంప్ కోర్టుకు హాజ‌రుకావ‌డం ఇది రెండోసారి. ఆ త‌ర్వాత ఆయ‌న న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్ట‌ర్‌లో ఉన్న గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు. అక్క‌డ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల‌ను ద‌గ్గ‌ర పెట్టుకునేందుకు త‌న‌కు అన్ని హ‌క్కులు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 76 ఏళ్ల ట్రంప్‌పై మెజిస్ట్రేట్ జ‌డ్జి జోనాథన్ గుడ్‌మాన్ ఎటువంటి ఆంక్ష‌లు విధించ‌లేదు. దేశీయ, అంత‌ర్జాతీయ ట్రావెల్ ఆంక్ష‌లు విధించ‌లేదు. చాలా హేయ‌మైన రీతిలో అధికార దుర్వినియోగానికి బైడెన్ ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. పూచీక‌త్తుపై ట్రంప్‌ను రిలీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అంశాల‌ను సాక్ష్యాల‌తో చ‌ర్చించ‌రాదు అని కోర్టు ఆదేశించింది. ర‌హ‌స్య ప‌త్రాలు క‌లిగి ఉన్న కేసులో ట్రంప్‌పై 37 నేరాభియోగాలు న‌మోదు అయ్యాయి.