రాజధానిగా అమరావతి కొనసాగించేవరకు ఆందోళన
ఆనాడు రాష్ట్ర రాజధాని కోసమే రైతులు తమ భూములు ఇచ్చారు

అమరావతి: రాజధాని గ్రామాలలో ఆందోళన చేస్తున్న రైతులకు టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. 47 రోజులుగా మహిళలు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆనాడు రాష్ట్ర రాజధాని కోసమే రైతులు తమ పొలాలను ఇచ్చారన్నారు. రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారని, ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ చరిత్రలో రాజధాని మార్చిన ఘనత ఆనాడు తుగ్లక్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్సార్సిపి పోటీ ఉద్యమాలు చేయడం నీచమని అన్నారు. రాయలసీమ, విశాఖపట్నం వాసులు కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఎంపీని రాయబారిగా జగన్మోహన్ రెడ్డి పంపించారని విమర్శించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/