ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న జగన్, విజయమ్మ

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇడుపులపాయ నుండి ముఖ్యమంత్రి జగన్ , విజయమ్మ లు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం మొదలుపెట్టారు. అంతకుముందు ప్లీనరీ వేదికపై వైఎస్సార్‌ విగ్రహానికి జగన్‌ నివాళులర్పించారు. ఈరోజు వైస్సార్ జయంతి సందర్బంగా ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ విజయమ్మ బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ నుంచి నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో బయలుదేరారు.

ప్లీనరీ తొలి రోజు 5 తీర్మానాలు చేయనున్నారు. రేపు శనివారం ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశమిస్తారని షెడ్యూల్‌లో పొందుపరిచారు. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌ గంటన్నర పైగా ప్రసంగించనున్నారు. అలాగే మొదటి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ నియమావళిలో సవరణనూ ప్లీనరీ వేదికగా చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు వంటివి ఆ సవరణల్లో ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్లీనరీకి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.