ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమలు చేసారు. 9 గంటల తర్వాత ఎవర్నీ లోపలికి అనుమతించలేదు. కాగా, ఇంటర్‌ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

ఈఏడాది ఇంటర్‌ పరీక్షలు అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో రాస్తున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లిష్‌ మీడియంలోనే హాజరవుతున్నారు. ఫస్టియర్‌లో 4.32 లక్షలు, సెకండియర్‌లో 4.09 లక్షలు ఇంగ్లిష్‌ మీడియంలో రాస్తుండగా, తెలుగు మీడియం ఫస్టియర్‌లో 45,376, సెకండియర్‌లో 50,673 విద్యార్థులు హాజరుకాబోతున్నారు. ఉర్దూ మీడియంలో ఫస్టియర్‌లో 4,544, సెంకడియర్‌లో 4,667 విద్యార్థులు హాజరవుతున్నారు. మరాఠీలో 198, హిందీలో 70, కన్నడలో 18 మంది పరీక్షలు రాయనున్నారు.

ఇక ఏపీలో 1489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఏపీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,82,677 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 4,65,022 మంది ఉన్నారు.

ఇక పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరింది. పరీక్ష కేంద్రాలకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులనుసైతం కోరడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలు సీల్ తీయడం, జవాబు పత్రాలు ప్యాక్ చేస్తామని అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్స్ నేరుగా విద్యార్థులే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. హాల్ టికెట్‌పై పేరు, సబ్జెక్ట్స్ పరిశీలించుకోవాలని విద్యార్థులకి సూచించారు. ఇన్విజిలేటర్స్ కి కూడా పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదని అధికారులు తెలిపారు.