తెలంగాణ ప్రజల కోసం రాళ్లదాడినైనా భరించేందుకు సిద్ధం : బండి సంజయ్

రైతుల ముసుగులో దాడులు చేయిస్తారని ఆరోపణ


హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. దీనిపై బండి సంజయ్ ట్విట్టర్ లో వెల్లడించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు చేపడుతున్న సామాజిక న్యాయ పక్షం కార్యాచరణపైనా చర్చించినట్టు వివరించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్లదాడినైనా భరించేందుకు సిద్ధమని బండి సంజయ్ ఉద్ఘాటించారు. రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు చేసే దాడులకు బీజేపీ కార్యకర్తలు, నేతలు సంమయనం పాటించాలని, ఎదురుదాడులు చేయవద్దని సూచించారు.

కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, మరెన్నో అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని వెల్లడించారు. యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ, కుటుంబ అవినీతి పాలనను పూర్తిస్థాయిలో ఎండగడతామని బండి సంజయ్ వివరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/