మార్చి26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో బిజీ గా ఉన్నారు. వరుసగా భారీ సభలు నిర్వహిస్తూ భారీగా నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా మార్చి26న మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇటీవలి నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పడుతున్న తపన, వారి దార్శనికతను మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకున్నారు.

తెలంగాణలో విప్లవాత్మక రీతిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ మాకూ ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారి కోరిక తీర్చే పనిలో పడ్డారు కేసీఆర్. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి.

మంగళవారం మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్, ఎన్సీపి నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపి నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.