భారత విదేశాంగ విధానాన్ని మరోసారి ప్రశంసించిన ఇమ్రాన్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అంశం ప్రస్తావన

Imran Khan once again praised India after playing a video of External Affairs Minister S Jaishankar

లాహోర్ః భారత్ పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. లాహోర్ లో ఓ సభలో ప్రసంగిస్తూ, భారత్ అనుసరిస్తున్న సర్వ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. అంతేకాదు, భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ వీడియోను కూడా ఇమ్రాన్ ఖాన్ ఆ సభలో ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ ను పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లోనూ అమెరికా ఒత్తిడిని తట్టుకుని భారత్ దృఢంగా నిలబడిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

స్లొవేకియాలో జరిగిన బ్రటిస్లావా ఫోరమ్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తమ బాణీని స్పష్టంగా వినిపించారని అన్నారు. భారత్, పాకిస్థాన్ లకు ఒకే సమయంలో స్వాతంత్ర్యం వచ్చిందని, తమ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత్ సొంత విదేశాంగ విధానం రూపొందించుకుంటే, వీళ్లు (షేబాజ్ షరీఫ్ ప్రభుత్వం) ఏంచేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

“ఈ వీడియో చూడండి. రష్యా నుంచి చమురు కొనొద్దని చెప్పడానికి మీరెవరు అంటూ జయశంకర్ ధైర్యంగా అడుగుతున్నారు. రష్యా నుంచి యూరప్ దేశాలు గ్యాస్ కొనుగోలు చేయడం లేదా? అని నిలదీస్తున్నారు. సర్వ స్వతంత్ర దేశం అంటే ఇలా ఉండాలి” అంటూ ఇమ్రాన్ ఖాన్ సభలో జైశంకర్ వీడియోను ప్రదర్శించారు. భారత్ అలా ఉంటే, పాకిస్థాన్ మాత్రం రష్యా చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతోందని అన్నారు. అమెరికాను ఎదిరించే ధైర్యం చేయలేకపోతోందని విమర్శించారు. అమెరికాకు మిత్రపక్షం అయివుండి కూడా భారత్ తన ప్రజల అవసరాల కోసం ధైర్యంగా నిలుచుందని అభినందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/