ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్స్.. వ్య‌క్తి అరెస్టు

mukesh-ambani-family-get-threat-calls-a-man-arrested-today-in-mumbai

ముంబయిః భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్​కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాయి. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ కేసులో ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఆ వ్య‌క్తిని అఫ్జ‌ల్‌గా గుర్తించారు. అత‌నే బెదిరింపు కాల్స్ చేసిన‌ట్లు భావిస్తున్నారు. గ‌త ఏడాది కూడా ముకేశ్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఆయ‌న ఇంటి ముందు ఓ స్కార్పియో కారుతో పాటు 20 జెలాటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్న విష‌యం తె లిసిందే. ఆంటిలియా ఇంటి ముందు ఓ బెదిరింపు లేఖ‌ను కూడా గుర్తించారు.

కాగా, ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ముఖేశ్ అంబానీ ముంబయి లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీలతో కలిసి వేడుక చేసుకున్నారు. మనవడిని ముఖేశ్ ఎత్తుకోగా… నీతా అంబానీ మువ్వన్నెల పతాకాన్ని చేత పట్టుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ వీరు జాతీయ పతాకానికి వందనం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/