75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాంః సోనియా గాంధీ

దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..సోనియా గాంధీ

Sonia-Gandhi-
Sonia-Gandhi-

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ తన సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశం సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తూ..అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిందని పేర్కొన్నారు. దూరదృష్టి గల నాయకుల నాయకత్వంలో స్వేచ్ఛ, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నామని, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం ద్వారా భారత్ ఎంతో గుర్తింపు పొందిందన్నారు. 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, అయితే నేడు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, దేశం సాధించిన విజయాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. మహత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్ వంటి గొప్ప జాతీయ నాయకులను తక్కువ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సోనియా గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా.. కరోనా పాజిటివ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొనలేదు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రయాంక గాంధీ కరోనా పాజిటివ్ కారణంగా ఐసోలేషన్ లో ఉండటంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేరుగా పాల్గొనలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/