ఈ విషయంలో వైస్సార్సీపీ కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలి

మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదన్న నియమాన్ని పాటిస్తున్నామన్న అచ్చెన్న

అమరావతి: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి కుటుంబ సభ్యులు కాకుండా మరెవరినైనా వైస్సార్సీపీ బరిలోకి దించి వుంటే తాము కూడా అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటి ఉండేవాళ్లమని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో నిలబడితే తాము ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూ దానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో తమ వైఖరి ఏంటో వైస్సార్సీపీ కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైస్సార్సీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న అచ్చెన్నాయుడు.. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అవి రాగానే వైస్సార్సీపీ ని వారు బంగాళాఖాతంలోకి విసిరేస్తారని అన్నారు. అనవసర సవాళ్లను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైస్సార్సీపీ నేతలకు అచ్చెన్న హితవు పలికారు.

కాగా, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో బీజేపీ, బీఎస్పీ సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుండగా, 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/