కాసేపట్లో సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మంగళవారం సత్యసాయి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఏరువాకతో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా మరోసారి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని ఇవాళ అకౌంట్‌లలో నేరుగా జమ చేయనున్నారు. కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో జగన్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారు. అక్కడినుంచి రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో మీట నొక్కి సీఎం విడుదల చేయనున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్​ పాల్గొంటారు. ఆ తరువాత రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందించనున్నారు. మధ్యాహ్నం 1గంట తరువాత తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే ఈ నెల 17న కడప జిల్లాలో జగన్‌ పర్యటించనున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరులో పర్యటించి పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఈ భేటీలో జిల్లాలో పార్టీ పటిష్టతపై కీలక విషయాలపై సీఎం జగన్‌ చర్చించే అవకాశాలు ఉన్నాయి.