సీఎం జగన్ వస్తున్నాడని ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

మాములుగా ఏదైనా పండగ వస్తేనో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్ వస్తున్నాడని సెలవు ప్రకటించడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఈరోజు సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరిగే ఓ కార్యక్రమంలో మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమం కోసం అధికారులు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను డ్వాక్రా మహిళల తరలింపునకు ఏర్పాటుచేసిన అధికారులు విమర్శలు రాకుండా ముందుగానే అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థల బస్సుల్లో మహిళలను సీఎం సభకు తరలించే బాధ్యతను వీ ఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు అప్పగించారు. దీనిపట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాల్లో..ఇప్పుడు కొత్తగా జగనన్న సెలవు పథకం అనేది అమలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక ఆసరా పథకం కోసం సీఎం జగన్ నేడు రూ.6,419 కోట్లు విడుదల చేస్తారు. మొత్తం 78.94 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.