బిజెపి మహా ధర్నా..ఇందిరా పార్కు దగ్గర హై అలర్ట్

BJP is world’s most important party: Wall Street Journal

హైదరాబాద్‌ః హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగ మహా ధర్నాకు బిజెపి పిలుపు ఇవ్వడంతో భారీగా నిరుద్యోగులు, బిజెపి శ్రేణులు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు ఇందిరాపార్కుకు చేరుకుంటున్నారు. బిజెపి మహా ధర్నా నేపథ్యంలో ఇందిరాపార్కు పరిసరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీగా పోలీసులు మోహరించారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బిజెపి నిరుద్యోగ మహాధర్నా చేస్తోంది. పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ధర్నాలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ధర్నాకు యువజన సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇందిరాపార్కు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

ఇందిరాపార్కు దగ్గర బిజెపి తలపెట్టిన మహాధర్నాకు ప్రభుత్వం ముందు అనుమతి ఇవ్వలేదు. దీంతో ధర్నాకు అనుమతివ్వాలంటూ బిజెపి హైకోర్టును ఆశ్రయించింది. బిజెపి మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500మందితో మహాధర్నా నిర్వహించుకోవాలని సూచించింది. అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు సూచించింది.