వామ్మో ఏంటి ఈ వానా..బిక్కుబిక్కుమంటున్న తెలంగాణ ప్రజలు

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు అధికారులు. అలాగే ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఖమ్మం సమీపంలోని ము న్నేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కొన్ని చోట్ల కట్ట తెగి రోడ్లు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల నుంచి 12 కార్లు, 10ద్విచక్ర వాహనాలపై నుంచి పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. అయితే భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగడంతో వారంతా అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పర్యాటకులను అడవిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. పర్యాటకులు అందరూ క్షేమంగా ఉన్నారు.

అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్‌లు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు.

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.