భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన తల్లీకూతురు

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వాగులు దాటే ప్రయత్నం చేస్తూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామ పంచాయతీ కుమ్మరపాడులో విషాదం చోటుచేసుకుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ తల్లీకూతురు కొట్టుకుపోయారు. కుమ్మరపాడుకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పొరుగు గ్రామానికి పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో వాగు దాటాల్సి వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 10 మంది కూలీలు ఒకరి చేతులు మరొకరు జాగ్రత్తగా పట్టుకుని దాటేందుకు ప్రయత్నించారు. వాగు మధ్యలోకి రాగానే వరద ఉధృతి పెరిగింది. దీంతో తల్లి, కూతురు వాగులో కొట్టుకుపోయారు. వాగు సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కూతురిని కాపాడారు. తల్లి వాగులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన మహిళ కోసం గాలింపు చేస్తున్నారు.