కేజీ టు పీజీ ఉచిత విద్య- రాహుల్ ప్రకటన

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబదించిన ఎన్నికలు నవంబర్ నెలలో జరగబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ , బిజెపి పార్టీలు పోటా పోటీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు.

బీడీ ఆకులు సేకరించే వారికి ఏడాది రూ.4 వేలు ఇస్తామని ప్రకటించారు. శనివారం కంకేర్‌ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిందని రాహుల్‌ గాంధీ గుర్తుచేశారు. ఈసారి అధికారంలోకి వస్తే.. కేజీ టు పీజీ వరకు ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాజీవ్‌ గాంధీ ప్రోత్సాహక యోజన కింద బీడీ ఆకులు సేకరించే వారికి రూ.4వేలు అందిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశంలో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.