అన్నదాతలకు కన్నీరు మిగిల్చిన అకాల వర్షం

అకాల వర్షం ..రైతున్నలకు కన్నీరు మిగిల్చించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుండి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. పలు జిలాల్లో కోతకు వచ్చిన మామిడి నేలరాలగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పడటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల చెట్లు కూలగా, విద్యుత్తు స్తంభాలు విరిగాయి. గణపురం, మహదేవపూర్‌, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపూర్‌, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాశులు తడిశాయి. ఖానాపురం, ఆత్మకూరు, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు మండలాల్లో మామిడి కాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్‌తోపాటు చింతకుంట కొనుగోలు కేంద్రాలు, రంసాన్‌పల్లి, దానంపల్లి, మాసన్‌పల్లి, ఎర్రారం శివారుల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిసోయింది. హత్నూర, మాధుర గ్రామాల్లో ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దమందడి మండలం అల్వాల గ్రామ శివారులో పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి చెందాయి.

హైదరాబాద్ లో కూడా గంటపాటు కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా రోడ్ల ఫై చెరువులను తలపించే విధంగా నీరు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.