అమరావతి గ్రామాల్లో నేడు బంద్
35వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

అమరావతి: ఏపిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. కాగా రాజధాని గ్రామాలు నేడు బంద్ కు పిలుపు నిచ్చారు. రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బంద్ నేపథ్యంలో పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించకూడదని, పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడంలేదు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/