వచ్చే నెల 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు..?

యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

గత ప్రభుత్వం వానాకాలం, యాసంగిలో సగం మంది రైతులు ధాన్యం విక్రయించాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈలోగా రైతులు వ్యాపారులు, దళారులకు ధాన్యం విక్రయించారు. మద్దతు ధర లభించక, తరుగు పేరుతో కోత, బస్తాల్లో నింపకున్నా బస్తాల పేరుతో కోత, వెంటనే డబ్బులు ఇవ్వక పోయినా 2శాతం కమీషన్‌, గుమస్తా మామూలు, వేబ్రిడ్జి చార్జీ, తూకం వేయకపోయినా హమాలి అంటూ రకరకాల కోతలతో రైతులు నష్టపోయారు. అందుకే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్‌లో 60-70లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.