వాలంటీర్లపై ఈసీ కొరడా
గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించరాదన్నారు. అయినప్పటికీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధి గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో వైసీపీ నిర్వహించిన మేము సిద్ధం-మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఏడుగురు వాలంటీర్లపై గ్రామస్థులు అక్కడి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి అధికారులు వాలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్‌బీ, అపర్ణ, కామాక్షి, పుష్పవతి, లక్ష్మన్న, మద్దిలేటిని విధుల నుంచి తొలగించారు.
ఎమ్మిగనూరు 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన వాలంటీరు నరసింహులును విధుల నుంచి తొలగించారు. కర్నూలు 127వ వార్డు సచివాలయానికి చెందిన వాలంటీరు మనోజ్‌కుమార్ కొత్తపేట ప్రాంతంలో వైసీపీ అనుకూల ప్రచారాన్ని చేపట్టినట్టు రుజువు కావడంతో విధుల నుంచి తప్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మణికంఠను విధుల నుంచి తొలగించారు.
వైసీపీ కోసం ఇంటింటి ప్రచారం చేసి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త మల్లంపేట సచివాలయం పరిధిలోని వాలంటీర్లు బోళెం ఓంకార విజయలక్ష్మి, శింగంపల్లి దుర్గాభవానిని డిస్మిస్ చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు మురళిని విధుల నుంచి తప్పించారు. మొత్తం 30 మందిని తొలగించింది ఈసీ.