అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం..

అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది. ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున EC అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా.

ఎక్కువగా నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో మంటున్నారు. దోమకొండ మండలంలో శనివారం, ఆదివారం కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలు నేలకొరిగాయి. వర్షానికి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జెడ్‌పిటిసి తిరుమల్‌గౌడ్ తదితరులతో కలిసి పరిశీలించారు.