ఉచిత మంచి నీటి పథకం ప్రారంభం

ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఇంటింటికి జీరో నీటి బిల్లుల‌ను పంపిణీ చేసిన మంత్రి కేటిఆర్

Free drinking water diet
Free drinking water diet

Hyderabad: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉచిత తాగునీటి ప‌థ‌కం ప్రారంభ‌మైంది. రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రి  కల్వకుంట్ల తారకరామారావు లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లుల‌ను కేటీఆర్ పంపిణీ చేశారు.

మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు ఉచిత తాగునీటి ప‌థ‌కాన్నిఈ రోజు ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ ప‌థ‌కం ద్వారా ఒక్కో కుటుంబానికి నెల‌కు 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు తాగునీటికి ఉచితంగా నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. బ‌స్తీల్లో న‌ల్లాల‌కు మీట‌ర్లు లేకున్నా ఉచితంగా తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అయితే అపార్ట్‌మెంట్ల‌లో మాత్రం నీటి మీట‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్ల‌లోని ఒక్కో ఫ్లాటుకు 20 వేల లీట‌ర్ల చొప్పున‌.. 10 ప్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్‌కు నెల‌కు 2 ల‌క్ష‌ల లీట‌ర్లు ఉచితంగా నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. 

 ఈ పథకం ద్వారా  జంట న‌గ‌రాల్లో మొత్తం 10.08 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. గ్రేట‌ర్‌లో 10.08 ల‌క్ష‌ల న‌ల్లా క‌నెక్ష‌న్ల‌లో 2.37 ల‌క్ష‌ల న‌ల్లాల‌కే మీట‌ర్లు ఉన్నాయి. ఉచిత తాగునీటి ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు రూ. 19.92 కోట్లు ఆదా కానున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/