రేపటి నుండి తెలంగాణ లో మహిళలకు ఉచిత బస్సు

తెలంగాణ లో అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని తెలిపిన కాంగ్రెస్..చెప్పిన విధంగానే రేపటి నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీపై భారీగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.

ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోందని.. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటుండగా.. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.