మొదలైన రేవంత్ ప్రజాదర్బార్

తెలంగాణ నూతన సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ..ప్రజా దర్బార్ మొదలుపెట్టారు. ఉదయం పదిగంటలకు ప్రగతి భవన్ లో ఆయన ప్రజాదర్బార్ ను నిర్వహిస్తారు. ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే భవన్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లే ఈరోజు ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు వినతి పత్రాలతో రావడం జరిగింది.

ఈ ప్రజాదర్బార్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే మధ్యాహ్నం విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. విద్యుత్తు అంశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌లో మాజీ సీఎం కేసీఆర్ రూ. 85 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎండీల రాజీనామాలు ఆమోదించవద్దని, రివ్యూ మీటింగ్‌కు సంబంధిత అధికారులంతా తప్పకుండా రావాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.