నేడే తుది విడత పోలింగ్.. సా.6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈరోజుతో ఫుల్ స్టాప్ పడనుంది. మొత్తం ఏడు దశలకు గాను ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తి కాగా..ఈరోజు చివరి దశ పోలింగ్ మొదలైంది. ఈరోజు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ విడతలో ముఖ్యనేతలు ప్రధాని మోదీ (వారణాసి), అనురాగ్ ఠాకూర్ (హమీర్పుర్), అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్), కంగనా రనౌత్ (మండీ) బరిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌ గట్టిపోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకుమించి గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. బీహార్ రాజధాని పాట్నా, నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారామ్, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది.

పోలింగ్ పూర్తయిన తర్వాత సా.6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా ముందే ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఓ అంచనాకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.