కాంగ్రెస్ నిర్ణయం ఫై అమిత్ షా సెటైర్లు..

దేశవ్యాప్తంగా గత 2 నెలలుగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా..ఈరోజుతో ముగింపు పలుకుతున్నాయి. ఈరోజు చివరిదైన 7 వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ విడతలో ముఖ్యనేతలు ప్రధాని మోదీ (వారణాసి), అనురాగ్ ఠాకూర్ (హమీర్పుర్), అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్), కంగనా రనౌత్ (మండీ) బరిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక జూన్ 4 వ తేదీన దేశంలో లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలోనే తుది దశ పోలింగ్ ముగియనున్న శనివారం రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్ విడుదల చేయనున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న వేళ.. హస్తం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అనంతరం టీవీ ఛానళ్లలో నిర్వహించే డిబేట్లలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా వెల్లడించారు. టీవీ ఛానళ్లు టీఆర్పీల కోసం చెప్పే ఊహాహానాల్లో మునిగిపోకూడదని పవన్ ఖేరా తెలిపారు. దేశంలోని కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. వారి తీర్పు ఖాయం అయిందని తెలిపారు.

కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసునని అన్నారు. ‘‘ మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు?. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలనే కాంగ్రెస్ నిర్ణయంపై జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదన్నారు. తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు.