నుపుర్ శ‌ర్మ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: సుప్రీంకోర్టు

నుపుర్ శర్మపై మండిపడ్డ సుప్రీంకోర్టు

sc-slams-nupur-sharma-for-prophet-remark-says-it-led-to-unfortunate-incidents-in-country

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు మండిపడంది. నుపుర్ శ‌ర్మ దేశ ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నేడు సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల అనంత‌రం ప‌లు చోట్ల అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. ఇటీవ‌ల ఉద‌య్‌పూర్‌లో ఓ టైల‌ర్‌ను హ‌త్య చేయ‌డానికి కూడా నుపుర్ వ్యాఖ్య‌లే కార‌ణం. అయితే దేశ‌వ్యాప్తంగా త‌న‌పై న‌మోదు అయిన అన్ని ఎఫ్ఐఆర్‌ల‌ను ఢిల్లీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టులో నుపుర్ శ‌ర్మ పిటిష‌న్ వేసింది. ఈ నేప‌థ్యంలో ఆ పిటిష‌న్‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందించింది. దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆమె ఒక్క‌రే వ్య‌క్తిగ‌తంగా బాధ్యురాల‌ని, యావ‌త్ దేశానికి ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర్టు తెలిపింది.

టీవీ చ‌ర్చ స‌మ‌యంలో ఆమెను ఎలా రెచ్చ‌గొట్టారో చూశామ‌ని, కానీ ఆ త‌ర్వాత ఆమె మాట్లాడిన తీరు ఆందోళ‌న‌ల‌కు దారి తీసింద‌ని, నుపుర్ దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌స్టిస్ సూర్య కాంత్ త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డ్డారు. చంపేస్తామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని నుపుర్ వేసిన పిటిష‌న్‌పై జ‌స్టిస్ సూర్య కాంత్ స్పందిస్తూ ఆమెకు బెదిరింపులు వ‌స్తున్నాయా లేక ఆమె సెక్యూర్టీ స‌మ‌స్య‌గా మారిందా అని ఆయ‌న అడిగారు. నుపుర్ చేసిన వ్యాఖ్య‌లు యావ‌త్ దేశ ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను ర‌గిలించింద‌ని, దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఈ మ‌హిలే బాధ్యురాలు అని జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు. నుపుర్ శ‌ర్మ నోరు జార‌డం వ‌ల్ల దేశం అగ్నికాష్టంగా మారిన‌ట్లు కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌కు ఆమె మాట‌లే కార‌ణ‌మ‌ని కోర్టు చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/