టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీ లోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. రీసెంట్ గా బిజెపి నేత కన్నా లక్ష్మి నారాయణ టీడీపీ కండువా కప్పుకోగా..తాజాగా ఈరోజు మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

గత 39 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు 40 వ రోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. మదనపల్లిలో బహిరంగసభ అనంతరం మదనపల్లి ఎస్సార్సీలో ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీలో చేరారు. లోకేశ్ బహిరంగ సభ వేదికపైనే ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఇన్చార్జి దొమ్మాలపాటి రమేశ్ తో కలసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ…మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని .. అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అని వివరించారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు ఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. మదనపల్లి పట్టణంలో నవాజ్ బాషా తన అనుచరులతో వెంచర్లు వేస్తున్నాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉండేలా ప్రేవేటు స్థలాల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నాడు. పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలి. 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారు” అని లోకేష్ వ్యాఖ్యానించారు.