కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీకి ఆహ్వానం

Invitation to Varun Gandhi in Congress

న్యూఢిల్లీః ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ వరుణ్‌ గాంధీ కి బిజెపి టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ గత కొంతకాలంగా పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న కారణంగా ఈ సారి ఎన్నికల్లో బిజెపి ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ వరుణ్‌ గాంధీకి తాజాగా ఓ ఆఫర్‌ ఇచ్చింది. వరుణ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. వరుణ్ గాంధీ వస్తే తాము స్వాగతిస్తామన్నారు. గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్న కారణంగా ఆయనకు బిజెపి టికెట్‌ నిరాకరించిందని ఆరోపించారు. ‘వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి వస్తే మేం ఎంతో సంతోషిస్తాం. అతను విద్యావంతుడు. క్లీన్‌ ఇమేజ్‌ కలిగిన వ్యక్తి. కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బిజెపి టికెట్‌ నిరాకరించింది. అందుకే ఆయనను మేం సాదరంగా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం’ అని అధిర్ రంజన్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి బిజెపి ఎంపీగా ఉన్న వరుణ్‌ గాంధీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తుంటారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.

ఈ క్రమంలో ఈసారి కమలం పార్టీ వరుణ్‌ గాంధీకి టికెట్‌ ఇవ్వలేదు. మరోవైపు వరుణ్‌ గాంధీ తల్లి మేనకా గాంధీకి మాత్రం బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి మరోసారి బరిలోకి దింపింది. పిలిభిత్‌ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు బిజెపి నుంచే గెలిచిన విషయం తెలిసిందే.