సినిమా థియేటర్స్ లలో ఎన్నికల ఫలితాలు లైవ్

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 04 న వెల్లడి కాబోతున్న సంగతి తెలిసిందే. ఒకే రోజు దేశ రాజకీయ పార్టీల భవిష్యత్ ఏంటి అనేది తేలనుండడంతో ఫలితాలను చూసేందుకు , తెలుసుకునేందుకు దేశ ప్రజలంతా ఆసక్తి గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటిని సినిమా థియేటర్లలో లైవ్‌లో ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు నిర్ణయించినట్టు తెలిసింది.

ముంబైలోని ఎస్ఎం 5 కల్యాణ్, సియాన్, కంజూర్‌ మార్గ్‌లోని మూవీ మ్యాక్స్ థియేటర్లు, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్‌మాల్, నాగ్‌పూర్‌లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణెలోని మూవీ మ్యాక్స్ వంటి థియేటర్లు వెండితెరపై ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అంతేకాదు, బిగ్‌స్క్రీన్‌పై ఫలితాలను తిలకించాలనుకునే వారి కోసం ఇప్పటికే పేటీఎం వంటి యాప్‌లలో టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైందట. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి.

దీనికి ఆడియెన్స్‌ నుంచి రెస్పాన్స్‌ కూడా బాగానే వచ్చింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. టికెట్‌ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. మరోవైపు దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది కొత్త రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ అని కొందరు కామెంట్ చేస్తే.. సినిమాల్లో మంచి కంటెంట్‌ లేకపోవడంతో ఇలాంటి వాటిని లైవ్ టెలికాస్ట్‌ చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ధియేటర్లలో ఫలితాల లైవ్ టెలికాస్ట్‌ నిర్ణయం రిస్క్‌తో కూడుకున్నదని.. తాము కోరుకున్న వ్యక్తులు, పార్టీలు గెలవని పక్షంలో పలువురు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.