వడదెబ్బకు గురైన కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనేక జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మరో నాలుగు రోజుల్లో 49 డిగ్రీలకు చేరువ అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ చెపుతుంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అటు వైద్య నిపుణులు, ఇటు వాతావరణశాఖ అధికారులు (IMD) హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా ఉంది. ప్రచారానికి ఇంకో పది రోజుల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయాలనీ భావిస్తున్నారు. కానీ ఈ ఎండలకు భయపడి కార్యకర్తలు సైతం బయటకు రావడం లేదు. రూ.500 ఇస్తామన్నప్పటికీ నో చెపుతున్నారు. ఇదే క్రమంలో కొంతమంది అభ్యర్థులు వడదెబ్బకు గురి అవుతున్నారు.

తాజాగా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురైయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ లో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం దూలం నాగేశ్వరావు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు.