వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు రహస్య సాక్షి వివరాలు

కేసు దర్యాఫ్తు ముగిశాక తదుపరి ఛార్జీషీట్లో రహస్య సాక్షి వివరాలు వెల్లడిస్తామన్న సీబీఐ

‘Secret witness’ in Viveka’s murder case.. CBI can’t reveal

కడపః వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాఫ్తు సంస్థ సీబీఐ.. రహస్య సాక్షి అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా రహస్య సాక్షి అంశాన్ని దర్యాఫ్తు సంస్థ ప్రస్తావించింది. కేసు దర్యాఫ్తు ముగిసిన తర్వాత వివరాలు సమర్పిస్తామని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసుకు సంబంధించి రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని ప్రస్తావించింది.

అవినాశ్ రెడ్డికి కడప లోక్ సభ సీటును ఇవ్వడం వైఎస్ వివేకానందరెడ్డికి ఇష్టం లేదని, దానికి బదులు జమ్మలమడుగు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పారని సదరు రహస్య సాక్షి తన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 26న ఈ వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి ఛార్జిషీట్లో ఈ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని, సాక్షిగాను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సాక్షి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని స్పష్టం చేసింది. ఈ విషయాలు బయటపెడితే ఏం జరుగుతుందో గతంలో జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తోందని పేర్కొంది.

వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి ఆత్మహత్య, మొదట వాంగ్మూలం ఇచ్చిన శంకరయ్య తర్వాత నిరాకరించడం వంటి సంఘటనలు జరిగాయని పేర్కొంది. కాబట్టి అవసరమైతే ఈ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పిస్తామని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవచ్చునని విజ్ఞప్తి చేసింది.

అయితే ఈ వాంగ్మూలాన్ని పిటిషనర్ కు ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా సీబీఐ సమర్పించిన వాంగ్మూలాన్ని పరిశీలించి మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు, సాధారణ న్యాయప్రక్రియకు విరుద్ధమని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్ కు వివరాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఉంటే సమర్పించాలని ఆదేశించింది.

ఈ కేసులో దర్యాఫ్తుకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయని, దర్యాఫ్తు అధికారిపై కూడా కేసులు పెట్టించారని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. వివేకా హత్యలో అవినాశ్ భాగమైనట్లు సీబీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడ్డారన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ కుటుంబం శక్తిమంతమైనదన్నారు. 2017 ఎన్నికల్లో వివేకాను ఓడించినట్లు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమని, డబ్బులు సమకూర్చింది అవినాశ్ రెడ్డే అన్నారు. అవినాశ్.. శివశంకర్ రెడ్డికి ఇవ్వగా, ఆయన గంగిరెడ్డికి డబ్బులు ఇచ్చారని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. గంగిరెడ్డి కేంద్రంగా రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందన్నారు.

వివేకా హత్యకు గుండెపోటు కారణమని అవినాశ్ చెప్పారని, ఈ మేరకు సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చారన్నారు. భాస్కరరెడ్డి తదితరులు దగ్గర ఉండి రక్తపు మరకలను తుడిచి వేయించారన్నారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఒకటిన్నర నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అవినాశ్ వాట్సాప్ కాల్ చేశారన్నారు. కుట్రలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నప్పుడు అతని ఫోన్ ఎందుకు తీసుకోలేదని సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డికి మూడు ఫోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు 31వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.