లోక్‌సభలో అదానీ గ్రూప్‌పై చర్చకు బిఆర్‌ఎస్ డిమాండ్

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల నిర్వాకంపై పార్లమెంటులో చర్చించాలని బిఆర్‌ఎస్ నిరసన కొనసాగుతున్నది. లోక్‌సభలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇతర బిజినెస్‌లను వాయిదావేయాలని, తక్షణమే అదానీ నిర్వాకంపై చర్చకు అనుమతివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్‌లో చర్చించాలని బిఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా 7 రోజులపాటు అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో బిఆర్‌ఎస్ ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ కోసం రాజ్యసభలో బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, దిగువ సభలో బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షా నేత నామా నాగేశ్వరరావు మరోసారి వాయిదా తీర్మానాలకు పట్టుబట్టారు. ఈ నోటీసులను ఉభయ సభల్లో తిరస్కరించటంతో కేంద్రానికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. అయినా చర్చకు అనుమతి ఇవ్వకపోడంతో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేసి, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీవిగ్రహం వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అదానీపై చర్చించాలని బిఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.