తొలి టీ20లో టీమిండియాదే బోణి

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

యువ ఆటగాడు శివమ్ దూబే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయినా…. శుభ్ మాన్ గిల్ (23), తిలక్ వర్మ (26), జితేశ్ శర్మ (31) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మానుల్లా గుర్బాజ్ (23) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్‌, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఓ వికెట్ సాధించాడు.