డీకే కామెంట్స్ తో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్..నిన్న తెలంగాణ ప్రచారంలో పాల్గొన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. కర్ణాటకలో తమ ప్రభుత్వం వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ ఇస్తోందని ప్రకటించారు. ఓవైపు బీఆర్ఎస్‌కు ధీటుగా.. తాము కూడా 24 గంటల విద్యుత్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తుంటే.. డీకే మాత్రం తాము 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, అదే గొప్పగా చెప్పడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చింది. ఇలా మాట్లాడుతున్నాడేంటి అని వారంతా అవాక్ అయ్యారు. శనివారం తాండూరులో నిర్వహించిన విజయభేరి కార్నర్ మీటింగ్‌లో డీకే ఈ వ్యాఖ్యలు చేసారు.

ఇప్పటికే తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ కూడా అదే హామీ ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తోంది. ఇంతలో.. తాము కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని డీకే ప్రకటించడంతో.. కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. డీకే వ్యాఖ్యలు తమకు నష్టం కలిగిస్తాయనే ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అని, డీకే వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని ప్రచారం మొదలుపెట్టారు.

https://twitter.com/Nallabalu1/status/1718263007585960026