జైలు నుండి వైస్ షర్మిల విడుదల

వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి బెయిల్ ఫై విడుదలయ్యారు. సోమవారం పోలీసులపై దాడి కేసులో వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసి , ఆమె ఫై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. మే 8వ తేదీ వరకు షర్మిలకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్ట్.

ఈ క్రమంలో ఆమె తరుపు న్యాయవాదులు బెయిల్ కోరగా..నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించడంతో చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిలను విడుదల చేశారు జైలు అధికారులు. బయటకు వచ్చిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.

‘ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ తాటాకు చప్పళ్లకు భయపడదు. ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి వస్తా. తెలంగాణ ప్రజల కోసం పోరాడతా. కేసీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తాడు. కేసీఆర్‌కు అసలు పాలన చేతనవుతోందా ? కేసీఆర్‌ ఏనాడైనా సెక్రటేరియట్‌కు వెళ్లారా ? ఆయన ఇప్పటి వరకు ఏ హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి చేస్తున్నారు. కుమార్తె లిక్కర్ స్కాంలో, కుమారుడు రియల్ ఎస్టేట్ స్కాంలో బిజీగా ఉన్నారు. సిట్‌కు రిప్రజంటేషన్ పత్రం ఇవ్వాలనుకోవడం నేరమా ? మగ పోలీసులు నా శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. మహిళా పోలీసులు నా చేయి విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు కొన్ని వీడియోలను మాత్రమే ఎంచుకుని వైరల్‌ చేశారు. నన్ను బెదిరించే వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు. నా ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేశా. కేసీఆర్‌ పాలనను తాలిబన్ పాలన అని కాక ఏమనాలి ? ఇదేనా బంగారు తెలంగాణ. పోలీసులు కేసీఆర్‌తు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పులి బోనులో ఉన్నా పులే. మీ తాటాకు చప్పుళ్లకు భయపడదు.” అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.