నేడు జాబిలిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్‌-3

Chandrayaan-3 will land on Jabili today

బెంగళూరు: చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. వ్యోమనౌక ఈరోజు(బుధవారం) సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్నది. సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై కాలుమోపనున్నది. ఈ చారిత్రక క్షణాల కోసం యావత్‌ భారతావనితోపాటు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. ఒక వేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేయనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ల్యాండింగ్‌కు ముందు మాడ్యూల్‌లోని అన్ని పారామీటర్లను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత నిర్దేశించుకొన్న ప్రాంతంలోచంద్రుడిపై సూర్యోదయం వరకు ఎదురుచూస్తారు. ల్యాండింగ్‌ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్‌’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్‌ మాడ్యూల్‌ సరైన ఎత్తులో, సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని తనకు తానుగానే ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఎత్తుపల్లాలు లేని ఉపరితలంపై దిగే ప్రాంతాన్ని కూడా కెమెరాతో స్కాన్‌ చేసుకొని దిగుతుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌ పవర్‌ బ్రేకింగ్‌ దశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతి అడుగు కీలకమే. చంద్రుని ఆకర్షణశక్తికి అనుగుణంగా ల్యాండర్‌ తన ఇంజిన్లను మండించుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తరువాత 11 నిమిషాలపాటు రన్‌ బ్రేకింగ్‌ దశ మొదలవుతుంది. ఈ దశలో ల్యాండర్‌ చంద్రునికి సమాంతరంగా నిలుస్తుంది. క్రమంగా ఫైన్‌ బ్రేకింగ్‌ దశలోకి వస్తుంది. దిగేందుకు అనువుగా ల్యాండర్‌ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. గతంలో చంద్రయాన్‌-2 ఈ దశలోనే కూలిపోయింది. ఈ దశల అనంతరం ల్యాండర్‌ చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు దాని వేగం సున్నాకు చేరుతుంది. అలా మెల్లిగా 150 మీటర్ల ఎత్తుకు చేరగానే దిగేందుకు సరైన ప్రదేశం కోసం ల్యాండర్‌ వెతుకుతుంది. అనువైన స్థలం దొరకకగానే అక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల ఉత్కంఠకు తెరపడి మిషన్‌ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు చంద్రుడిపై గడుపుతుంది.