యమునా నది ఉధృతి..ఢిల్లీలో పాత రైల్వే బ్రిడ్జి మూసివేత

206 మీటర్లు దాటిన యమునా నది నీటిమట్టం

Delhi on flood alert as Yamuna water level rises above 206 meter

న్యూఢిల్లీ: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ ‌, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో యమునా నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతున్నది. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

నది మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో పాత రైల్వే బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. వంతెనపైకి ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదు. కాగా, హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజి నుంచి 2 లక్షలకుపైగా క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయడంతో యమునా నది కొన్నిప్రాంతాల్లో 206.7 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.