కాంగ్రెస్ వస్తే రైతుబంధు ఉండదు – జడ్చర్ల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఉండదన్నారు బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ ..వరుసగా పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈరోజు జడ్చర్ల , మేడ్చల్ సభల్లో పాల్గొన్నారు.

జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడుతూ.. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ చెబుతుందని.. కరెంటు కాటగలుస్తుంది జాగ్రత్త అంటూ రైతులు, ప్రజలను సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. లక్ష్మారెడ్డిని మరో సారి గెలిపించాలని జడ్చర్ల నియోజకవర్గ ఓటర్లను కోరారు కేసీఆర్. ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏ మూలకు పోయిన ఏడుపు వచ్చేదన్నారు. నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రొ.జయశంకర్ చెప్పినందుకు మహబూబ్ నగర్ నుంచి తాను గతంలో ఎంపీగా పోటీ చేశానన్నారు. నేను మహబూబ్ నగర్ ఎంపీ గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.

‘నిన్నగాక మొన్నం మేనిఫెస్టో విడుదల చేశాం. పెన్షన్‌ ఇస్తే ఓట్ల కోసం లంగమాటలు చెప్పలే. సంసారం చేసినట్లు.. ఎట్లైతే మంచిగనడుస్తదో అట్ల చేసుకుంటుపోయాం. రైతుల కోసం పట్టుపట్టి.. జట్టుగట్టి చెట్టుకొకరు.. గుట్టకొకరు అయ్యారు కాబట్టి నా రైతుబిడ్డలు. బొంబాయి వలసపోయారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరూ చెప్పకుండా నేను డిజైన్‌ చేసిందే.. నేను పుట్టించిందే రైతుబంధు పథకం. ఈ పథకం ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడా లేదు. ఇవాళ నెత్తిమాసినోడు వచ్చి అడ్డంపొడువు మాట్లాడుతరు. ఎప్పుడైనా రైతుబంధు అనే స్కీమ్‌ విన్నమా? బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ లేకముందు విన్నమా? గొడగొడ ఎడిస్తే కూడా పట్టించుకోలే’ అని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు కడుపులో ఉన్న మాట కక్కిండు. రైతులకు ఎందుకుయ్యా.. కేసీఆర్‌ అనవసరంగా 24గంటలు కరెంటు ఇస్తుండు. మూడు గంటలు ఇస్తే సరిపోతది అంటుండు. మూడు గంటలు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలా? మూడు గంటల కరెంటు కావాలా?. కాంగ్రెస్‌గిట్ల వస్తే మళ్లీ కాటగలుపుతరు. భారతదేశం మొత్తంలో 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రధానికి కూడా చేతనైనత లేదు. గుజరాత్‌లో రోడ్లపై పడి గడబిడ చేస్తున్నరు. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌. కరెంటు కాటకలుస్తుంది. మళ్లీ మొదటికి వస్తుంది.. జాగ్రత్త అని మనవి చేస్తున్నా. ఇప్పుడు వచ్చి మస్తు చెబుతరు. ఎలక్షన్లు కాబట్టి గోల్‌మాల్‌ తిప్పాలని అడ్డం పొడువు మాట్లాడుతరు. ఏది నిజమో.. ఏది కాదో ఆలోచించాలి అని కోరారు.