చేపలకై వల వేస్తే ఏం దొరికిందో తెలుసా?

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు పలుమార్లు పెద్ద మొత్తంలో చేపలు దొరుకుతుంటాయి. కానీ కొందరికి మాత్రం ఎంతకీ చేపలు దొరకకపోవడంతో వారు నిరాశగా వెనుదిరుగుతుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు వారు ఊహించని విధంగా ఓ మొసలు వారి వలకు చిక్కింది. ఈ ఘటనతో వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంట ఊర చెరువులో చేపల కోసం మత్స్యకారులు ఓ వలను వేశారు.

అయితే వలలో చాలా బరువుగా మారడంతో తమకు పెద్ద చేపలు దొరికాయని వారందరూ సంతోష పడ్డారు. కానీ వలను లాగుతున్న కొద్దీ, అది మరింత బరువు అవుతూ వచ్చింది. తీరా వలలో ఏం చిక్కుకుందా అని వారందరూ ఆసక్తిగా చూడగా, ఓ భారీ మొసలి అందులో చిక్కుకుని ఉంది. ఇది చూసి వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. సుమారు 100 కిలోల బరువుగల ఈ మొసలిని బంధించేందుకు వారు సుమారు రెండు గంటలపాటు శ్రమించారు.

ఇలా చేపల వలలో మొసలి చిక్కుకుందని అటవీ శాఖ ఉద్యోగులకు వారు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఆ మొసలిని పాకాల సరస్సులో వదిలేందుకు తీసుకెళ్లినట్లు మత్స్యకారులు వెల్లడించారు. మొత్తానికి చేపల కోసం వెళ్తే, వారికి మొసలి లభించిందని ఆ మత్స్యకారులు నిరాశగా వెనుదిరిగారు.