పాపం.. ఈ దొంగ టైం వెరీ బ్యాడ్!

మనం ఏదైనా పని మొదలుపెట్టే సమయంలో అది సరిగా జరగకపోతే, టైం సరిగా లేదని మనం చాలాసార్లు ఫీలవుతుంటాం. కానీ ఓ దొంగకు మాత్రం నిజంగా టైం బాగాలేకపోవడంతో, అతడు చేసిన పనికి ఆసుపత్రి పాలయ్యాడు. యూపీలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ, తాను అనుకున్న దానికంటే ఎక్కువగా దోచుకోవడంతో గుండెపోటు తెచ్చుకుని ఆసుపత్రిలో చేరాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘనటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ పబ్లిక్ సర్వీస్ సెంటర్‌లో గతనెల 16, 17న ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇందులో ఓ దొంగ తాను అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉండటంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే తాను ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో సొమ్ము లభించడంతో అతడికి తీవ్ర గుండెపోటు వచ్చింది.

దీంతో అతడితో పాటు ఉన్న మరో దొంగ, సదరు దొంగను ఆసుపత్రిలో చేర్పించాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే, ఆ దొంగ దొంగలించిన సొమ్ములో పెద్ద మొత్తం ఆసుపత్రి ఖర్చులకే సరిపోయింది. దీంతో ఆ దొంగ చాలా బాధపడుతున్నాడట. ఈ మేరకు దొంగతనం ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ఈ ఇద్దరు దొంగలను పట్టుకుని కటకటాల్లోకి తోశారట. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.