బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనకు చరమ గీతం పాడాలి : ఎమ్మెల్యే సీత‌క్క‌

seethakka

హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే సీతక్క వెంకటాపూర్ మండలంలోని లక్ష్మి దేవి పేట, గంగి రెద్దుల గూడెంలో ఉపాధి హామీ కూలీలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీత‌క్క మాట్లాడుతూ.. గడిచిన టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమి లేదని, ముఖ్యంగా దేశానికే వెన్నుముక అయిన రైతన్నలను నట్టేట ముంచిన కేసీఆర్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంద‌న్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు అని, ఎన్నికల సమయములో కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి అన్నాడు.. ఇవ్వాళ నిరుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేవు, రైతు ఋణమాఫీ లేదు, రైతులకు పంట నష్టపరిహారం లేదు, ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు, డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అన్నాడు అస‌లు ఆ ఊసే లేద‌న్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు అంతే లేద‌న్నారు.

కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాల‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటాం ధరలు ముందే నిర్ణయం, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం, మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు. రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి అని, అసమర్థ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనకు చరమ గీతం పాడాల‌ని ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/