నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్‌-4 పరీక్ష హాల్‌టికెట్లు

జూలై 1వ తేదీన గ్రూప్‌-4 పరీక్ష జరగనున్న నేపథ్యంలో అధికారులు ఈరోజు నుండే గ్రూప్‌-4 పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. జూలై 1న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే రావాలని అధికారులు సూచించారు. హాల్‌ టికెట్‌ వెనక భాగంలో ముద్రించిన నియమ నిబంధనలను అభ్యర్థులు తప్పక పాటించాలని సూచించారు.

ఈ పరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రాల్లో అవసరమైన పరీక్ష కేంద్రాలను టీఎస్పీఎస్సీ గుర్తించింది. పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించింది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ఈ సారి గ్రూప్‌-4లో ప్రయోగాత్మకంగా థంబ్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని యోచిస్తున్నది. బయోమెట్రిక్‌కు ఒక్కో అభ్యర్థికి సుమారు 30 నుంచి 40 సెకన్ల సమయం పడుతుంది. అదే థంబ్‌కి 5 నుంచి 10 సెకన్లలోనే పూర్తవుతుంది. ఇవన్నీ ఆలోచించిన కమిషన్‌ గ్రూప్‌-4లో థంబ్‌ అటెండెన్స్‌ను తీసుకోవడంపై స మాలోచనలు చేస్తున్నది. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో కమిషన్‌ చర్చలు జరిపింది. టెక్నీషియన్ల అభిప్రాయాలు స్వీకరించింది. గ్రూప్‌-4లో థంబ్‌ అటెండెన్స్‌కి సంబంధించి ఇప్పటికే కమిషన్‌ సూత్రప్రాయంగా ఓకే చెప్పేసినట్టు తెలిసింది.