తమ నిరసన బిజెపికి వ్యతిరేకంగా కాదు… రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంః సిద్ధరామయ్య

తమ నిరసనలో రాష్ట్ర బిజెపి కూడా పాల్గొనాలని పిలుపు

Cong govt’s protest in Delhi against ‘njustice’, not BJP.. CM Siddaramaiah

బెంగళూరు: తమ రాష్ట్రానికి నిధుల పంపిణీలో అన్యాయం జరుగతోందని, అందుకే ఫిబ్రవరి 7న తమ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపడుతున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రాలకు పన్నుల పంపిణీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో తమ నిరసన కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్నదే తప్ప… బిజెపికి వ్యతిరేకంగా కాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తోన్న అన్యాయంపై మాత్రమే పోరాటం కాబట్టి కర్ణాటకలో ప్రతిపక్ష బిజెపి కూడా ఢిల్లీలో తాము చేపట్టే నిరసనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసనలో పాల్గొంటారని తెలిపారు.

“దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నాం. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు కూడా ఇందులో పాల్గొనాలి” అని ముఖ్యమంత్రి కోరారు. ఈ పోరాటం కాంగ్రెస్, బిజెపి మధ్య కాదని… అలాగే బిజెపికి వ్యతిరేకంగా కాదని… కేవలం కర్ణాటక రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాత్రమే అన్నారు. కాబట్టి ఈ నిరసనలో కర్ణాటక బిజెపి పాల్గొనాలని కోరారు.

14వ ఆర్థిక సంఘం ప్రకారం కర్నాటకకు దాదాపు 4.71 శాతం పన్నులు, 15వ ఆర్థిక సంఘం ప్రకారం 3.64 శాతం పన్నుల వాటా వచ్చిందని, కానీ దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల రాష్ట్రానికి రూ.రూ.62,098 కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్రంలోని తీవ్ర కరువు పరిస్థితులపై కూడా భారత ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించినట్లు చెప్పారు. కర్ణాటకలో రూ.35వేల కోట్ల మేర పంట నష్టం జరిగిందన్నారు. రూ.17,901 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించామని… కానీ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.

తాము కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించిన తర్వాత కేంద్ర బృందం వచ్చి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిందని.. ఇందుకు సంబంధించి కేంద్రానికి నివేదికను కూడా సమర్పించిందన్నారు. అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఎటువంటి సమావేశం నిర్వహించలేదన్నారు. కేంద్ర బృందం నివేదిక సమర్పించిందని.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ ద్వారా ఒక్క పైసా కూడా రాలేదన్నారు.

పంట నష్టపరిహారంపై రాష్ట్ర బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పంట నష్టం పరిహారం చెల్లించలేదని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 లక్షల మంది లబ్ధిపొందిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.2000 విడుదల చేసిందన్నారు. ఇందుకోసం రూ.650 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అదనంగా జిల్లాల డిప్యూటీ కమిషనర్ల వద్ద సహాయక చర్యలు చేపట్టేందుకు, తాగునీరు, పశుగ్రాసం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.

కర్ణాటక ప్ర‌జ‌లు చెల్లిస్తున్న ప‌న్నులు క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఉపయోగపడటం లేదని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. క‌ర్నాట‌క రాష్ట్ర సంక్షేమం కోసం న్యాయ‌మైన రీతిలో త‌మ‌కు రావాల్సిన నిధుల్ని ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. దక్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఉపయోగిస్తున్నారని… ఉత్త‌రాది రాష్ట్రాలు త‌మ‌కు రుణ‌ప‌డి ఉన్న‌ాయని సిద్ధరామయ్య అన్నారు. ఆ రాష్ట్రాలు ఎన్న‌డూ త‌మ‌కు మోడ‌ల్‌గా నిలువ‌లేవ‌న్నారు.